హోం క్వారంటైన్లో ప్రజాప్రతినిధి
విజయనగరం,జూన్ 23: తెలంగాణలో ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. తాజాగా ఎపిలోనూ ఓ ఎమ్మెల్యేకు కరోనా సోకింది. ఇప్పటివరకు కేవలం సామాన్య ప్రజానీకం మాత్రమే కరోనా బారినపడగా, ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కోవిడ్ మహమ్మారికి చిక్కుతున్నారు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు వైరస్ బారిన పడ్డారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారి అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకింది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది. శ్రీనివాసరావు ఈ నెల 10న అమెరికా నుంచి స్వస్థలానికి వచ్చారు. అమెరికా నుంచి వచ్చాక పరీక్షలు చేయించుకోగా ఆయనకు నెగిటివ్ వచ్చింది. తాజా పరీక్షల్లో మాత్రం పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే శ్రీనివాసరావు హోం క్వారంటైన్ కు వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఐతే శ్రీనివాసరావు మొన్న ముగిసిన అసెంబ్లీ బ్లడెట్ సమావేశాలకు వచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు. అందువల్ల ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులకు టెన్షన్ పట్టుకుంది. మరోవైపు ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాత్రం తీవ్ర ఆందోళన మొదలైంది. ------